నేను చాలా రోజుల నుంచి ఓ కథ (కల్పితం కాదు) రాయాలనుకుంటున్నాను.. ఎవరి కథ రాయాలి.. ఎలా రాయాలి అని అనుకుంటుండేవాన్ని. ఓ రోజు ఆఫీస్‌కు వచ్చిన తరువాత బ్రేక్‌లో నా గరువు సమానుడైన ఎం.వి.చక్రధర్ అన్నయ్యకి ఈ విషయం చెప్పాను. ఒరే పిచ్చోడా ఎవరిదో... ఏదో ఊహించుకుని రాసే కంటే ... నీ చిన్న నాటి సంగతులు... మీ కుటుంబం గురించి రాసెయ్ అన్నారు. ఎలా మొదలు పెట్టాలి... నాకు కనీస అవగాహన కూడా లేదే..? అన్న నా ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం ఏమిటంటే.. ప్రజలకు అర్థమయ్యే భాష రాయగలిగే పరిజ్ఞానం ఉంటే చాలని చెప్పారు. ఆ సలహానే ...ఓ సామాన్యుని జీవితం కు పునాది రాళ్లయ్యాయి. నాలో చాన్నాళ్లుగా దాగిఉన్న రాయాలనే నా కోరికకు బలాన్నిచ్చాయి....
ఓ రోజు నా మిత్రుడు... సహోద్యోగి గంగాధర్ వీర్ల తన బ్లాగ్ చూస్తున్నప్పుడు నేనుకూడా బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నానని చెప్పాను. అతని సహకారంతో ఇది... నా మాట... బ్లాగ్ ను క్రియేట్ చేశాను. నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్న కథ రాసే కార్యక్రమానికి నా బ్లాగ్ వేదిక కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది..
ఈ రోజు నుంచి నా గరించి... నా గతం గురించి... నా కుటుంబం గురించి రాయాలని నిశ్చయించుకున్నాను. ఇది ఓ సామాన్య... మధ్య తరగతికి చెందిన నా గురించి... నా కుటుంబం గురించి. నేను రాసే ఈ కథలో మీ కుటుంబానికి చెందిన... మీ గతానికి చెందిన కొన్ని సందర్భాలు కనిపించవచ్చు... అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
![]() |
| Add caption |
ముందుగా మా అమ్మమ్మ గురించి... ఎందుకంటే...
నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో. అక్కడ ESI ఆసుపత్రిలో నేను పుట్టాను. మా అమ్మమ్మ వాల్లఊరు అదే కాబట్టి. మా అమ్మమ్మ యమునాబాయి అదే హాస్పిటల్‌లో స్వీపర్‌గా పనిచేస్తుండేది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మా అమ్మమ్మవాళ్ల అత్తగారు వరంగల్ జిల్లా చింతగట్టు. ఆమెకు ముగ్గరు ఆడపిల్లలు. ఆ తరువాత మా తాతగారు కాలం చేశారు. అత్తగారింట్లో చీదరింపులు... సూటిపోటిమాటలు... అవమానాలు భరించలేక అక్కడినుంచి పొట్ట చేతబట్టుకొని కాగజ్‌నగర్‌కు వచ్చింది. మగదిక్కు లేని కుటుంబం... కాబట్టి స్థానికంగా ఉన్న (నర్సింగ్ పవార్) మా పెదనాన్న అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకునే వాడు. ఆయనకు కాగజ్‌నగర్‌లో భవాని బ్రాందీషాపు ఉండేది. సానుభూతి కంటే... స్వయంకృషే మేలు అని అనుకున్న మా అమ్మమ్మ కూరగాయల వ్యాపారం చేయలాని నిర్ణయించుకుంది. వ్యాపారానికి మా పెదనాన్న ఆర్థిక సహాయం కూడా చేశాడని చాలా సందర్భాల్లో మా అమ్మమ్మ చెబుతుండేది. తలమీద గంపను పెట్టుకుని ఊరంతా తిరిగుతూ కూరగాయాలు అమ్మి కుటుంబాన్ని ఈడ్చుకొచ్చింది మా అమ్మమ్మ. కొన్నేళ్ల తరువాత మా పెద్దనాన్న సలహా మేరకు ESI హాస్పిటల్‌లో స్వీపర్‌గా చేరింది. దీంతో మా అమ్మమ్మకు తలమీధ (కూరగాయల గంప) భారం నుంచి విముక్తి లభించింది. ఆసుపత్రిలో స్వీపర్‌గా చేరిన తొలినాళ్లలో ఆవిడ జీతం ఎంతో తెలుసా... కేవలం 30రూపాయలేనట.
- ఇంతకీ ముగ్గురు కూతుళ్ల వివరాలు...
- కాగజ్‌నగర్‌లో మా అమ్మమ్మ ఎక్కడుండేది...
....మీ
రాజ్‌కుమార్ ఖత్రి

మీ కథ, కథనం బాగుందండీ రాజ్ గారు. నేను కూడా కాగజ్‌నగర్‌లో Esi ఆసుపత్రిలో పుట్టాను. అక్కడే 6 వ తరగతి వరకు చదివాను, బాలభారతిలో. మా నాన్న పోలీసు డిపార్ట్మెంట్లో వైర్లెస్ ఆపరేటర్ గా చేసేవారు. చిన్ననాటి జ్ఞాపకాలు మెదిలాయి మీ కథ చదివి.
ReplyDelete